బంపర్‌ ఆఫర్లు.. ఐనా నో ఇంట్రెస్ట్

 సిటీబ్యూరో:  రూ.20 వేలుంటే చాలు ఎంచక్కా  ఏ బ్యాంకాకో, సింగపూర్‌కో ఝామ్మంటూ వెళ్లిపోవచ్చు. హాయిగా ఆ దేశాల్లో విహరించి  తిరిగి  సిటీకి వచ్చేయొచ్చు. విదేశాలకు  వెళ్లాలంటే ఇప్పుడు  రూ.లక్షలు  ఉండాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి  మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్‌లకు  కొద్దిపాటు చార్జీలతోనే  వెళ్లిరావచ్చు. అంతేకాదు, కొన్ని  ఎయిర్‌లెన్స్‌  ప్రయాణికులు చెల్లించిన చార్జీలపైన క్యాష్‌బ్యాక్‌  ఆఫర్లను  కూడా ప్రకటిస్తున్నాయి. పర్యాటకులను ఆకట్టుకొనేందుకు, విదేశీటూర్లకు తీసుకెళ్లేందుకు ట్రావెల్‌ ఏజెన్సీలు  పడిగాపులు కాస్తున్నాయి. కానీ  హైదరాబాద్‌ నగర పర్యాటకులు మాత్రం ముందుకు రావడం లేదు. ఆ మూడు దేశాలకు వెళ్లేందుకు ‘బాబోయ్‌  మేం రాబోమంటూ’  వెనుకడుగు  వేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ టూరిస్టు సంస్థలు సైతం ప్యాకేజీలను  విరమించుకుంటున్నాయి.



గత రెండు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోనా వైరస్‌ ప్రభావంతో  హైదరాబాద్‌ నుంచి విదేశీ  ప్రయాణాలు  తగ్గుముఖం పట్టాయి. చైనా, హాంకాంగ్‌లకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోగా  పర్యాటకులు ఎక్కువగా  వెళ్లే  మలేసియా, సింగపూర్, బ్యాంకాక్‌లకు  మాత్రం  చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఉద్యోగ, వ్యాపార అవసరాల దృష్ట్యా  తప్పనిసరిగా వెళ్లవలసిన  ప్రయాణికులు మినహా సాధారణ  సందర్శకులు మాత్రం  ససేమిరా  అంటున్నారు. దీంతో  హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం  నుంచి  సాధారణంగా ప్రతి రోజు  సుమారు 10 వేల మందికి పైగా విదేశాలకు రాకపోకలు సాగిస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్య  6000 నుంచి  7000 వరకు పడిపోయినట్లు  అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.