నిఘా యాప్‌.. ఎన్నికల్లో కొత్త ఒరవడి

అమరావతి : స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో అక్రమాలను సామాన్యులు సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు నిఘా యాప్‌ రూపకల్పన చేసింది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తాడేపల్లిలోని తన నివాసంలో నిఘా యాప్‌ను ఆవిష్కరించారు. నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలనుకునే వారిని ప్రోత్సహించనుంది. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని నివారించి, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం, పోలీస్‌ వ్యవస్ధ తీసుకుంటున్న చర్యలకు అదనంగా నిఘా యాప్‌ను రూపొందించింది. సామాన్యులెవరైనా ఈ నిఘా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీకి పాల్పడుతున్న వారి వివరాలతో పాటు చట్ట వ్యతిరేకంగా తమ దృష్టికి వచ్చిన ఏ అంశంపైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. యాప్‌ ద్వారా చేసే ఫిర్యాదులు నేరుగా సెంట్రల్‌ కంట్రోల్‌ రూంకు చేరుతాయి. అక్కడ నుంచి సంబంధిత అధికారులు దానిపై చర్యలు తీసుకుంటారు. (ఎన్నికల్లో అక్రమాలకు.. మొబైల్‌ యాప్‌తో 'చెక్‌')